-సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యల పూర్తికి గడువుల నిర్దేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ)ను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని వైద్య విద్యా సంచాలకులు ఏ. విష్ణువర్ధన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీయూల్లో మౌలిక సదుపాయాల కల్పన, అత్యవసర వైద్య పరికరాల కొనుగోలు, నిపుణులైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
సుప్రీంకోర్టు 2026 సెప్టెంబరు 21న జారీ చేసిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ రూపొందించిన ఐసీయూల నిర్వహణ, సేవల మార్గదర్శకాలను అమలు చేయాలి. ఇందులో భాగంగా ఐసీయూ స్థాయి-1కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలకు ప్రత్యేక గడువులు నిర్దేశించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు 9 నెలలు:
Uఇప్పటికే ఉన్న ఐసీయూల స్థానం, పరిమాణం, నిర్మాణంలో అవసరమైన మార్పులు చేసేందుకు 9 నెలల గడువు ఇచ్చారు. పడకల వద్ద అవసరమైన సదుపాయాలను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలి. నర్సింగ్ స్టేషన్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనను 9 నెలల్లోగా పూర్తి చేయాలి.
\- వైద్య పరికరాల కొనుగోలుకు మూడు నెలలు:
అత్యవసర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియతోపాటు కొనుగోలు, సరఫరా ఉత్తర్వులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలి. పరికరాల సరఫరా, ఏర్పాటు పరిస్థితులను బట్టి మరో మూడు నెలల వరకు గడువు ఉంటుంది. చిత్రీకరణ పరీక్షలకు అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేసి, వాటి ఏర్పాటుకు మరో మూడు నెలల వరకు అవకాశం ఉంటుంది. అత్యవసరం కాని వైద్య పరికరాల కొనుగోలు, ప్రయోగశాల సేవలకు సంబంధించిన ఏర్పాట్లను మూడు నెలల్లోగా పూర్తి చేయాలి.
ఇన్ఫెక్షన్ నియంత్రణ, భద్రతకు తక్షణ చర్యలు:
ఐసీయూల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలి. అదనపు సేవల ఏర్పాటుకు నెల రోజుల గడువు ఇచ్చారు.
*ఐసీయూల నిర్వహణకు అవసరమైన నిపుణులైన వైద్యులు, శిక్షణ పొందిన ఎంబీబీఎస్ వైద్యులు, నర్సులు, ఇతర అనుబంధ ఆరోగ్య సిబ్బంది నియామకాలను తక్షణమే ప్రారంభించి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య సేవలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, తనిఖీలను తక్షణమే చేపట్టాలి.
స్థాయి-2, స్థాయి-3 ఐసీయూలకు ప్రత్యేక ప్రమాణాలు:
ఐసీయూ స్థాయి-1 మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి. అయితే ప్రతి ఆసుపత్రిలో స్థాయి-2, స్థాయి-3 ఐసీయూలు ఉండటం తప్పనిసరి కాదు. ఆయా స్థాయులకు నిర్దేశించిన అన్ని ప్రమాణాలను పూర్తిగా పాటించినప్పుడే ఆ స్థాయి ఐసీయూలుగా గుర్తించాలి. ప్రమాణాలు పూర్తికాని ఆసుపత్రులను అమలైన సదుపాయాల స్థాయికి అనుగుణంగా వర్గీకరించి పేరు మార్చాలి. అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య ఆసుపత్రుల్లో స్థాయి-1 ప్రమాణాలతోపాటు స్థాయి-3 ఐసీయూ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి.
