-పోలీసు అధికారుల తీరుపై విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
-పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్, రాజంపేట, యర్రగుంట్లలో ఎన్నికల అక్రమాలపై ఎంపీ ఫిర్యాదు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఎన్నికల హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థుల బెదిరింపులు, పోలీసుల పక్షపాత వైఖరిపై తాను చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలకంగా స్పందించిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.
తాను గవర్నర్కు సమర్పించిన ఫిర్యాదులను గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించగా, వాటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నిజానిజాలను నిర్ధారించి, సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించిందని పేర్కొన్నారు. విచారణ పూర్తి చేసి 24 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అక్టోబర్ 29, 2026న జారీ చేసిన లేఖలో స్పష్టం చేసిందని వెల్లడించారు.
పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్, రాజంపేట, యర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎన్నికల హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులను బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తాను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వైఫల్యాలు, రాజకీయ పక్షపాత ధోరణి కారణంగా శాంతిభద్రతల పరిరక్షణలో లోపాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.
ముఖ్యంగా డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఐపీఎస్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఐపీఎస్, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ అధికారుల విధుల నిర్వహణపై తాను లేవనెత్తిన అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి గతంలో జారీ చేసిన నిబంధనలు, 2019లో ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్ నియామకంపై కూడా సమీక్షించాలని కోరినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా, అక్టోబర్ 15, 2026న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 30103/2026లో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారనే అంశాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ ఉంటుందని ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగంపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే హక్కు ఉందని, ఆ హక్కును అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించడం, 24 గంటల్లో నివేదిక కోరడం కీలక పరిణామమని తెలిపారు. అయితే విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, తప్పు చేసినట్లు తేలిన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్ది నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా బాధ్యత వహించాల్సిందేనని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.
