-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మేయర్ స్థానంతో పాటు మొత్తం 86 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 45 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా స్ట్రాంగ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్సులకు రాండమైజేషన్ నిర్వహించి, అనంతరం కేటాయించిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను పంపిణీ కేంద్రానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన బ్యాలెట్ పేపర్ల సంఖ్య, బ్యాలెట్ బాక్సుల పనితీరు, ఎన్నికల సామగ్రి సక్రమంగా ఉందా లేదా అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత సిబ్బందితో కలిసి బస్సుల ద్వారా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరినట్లు వివరించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు), మైక్రో అబ్జర్వర్లు, రూట్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 848 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, శనివారం సాయంత్రం కల్లా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి చేరుకునేలా సమయపాలనతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
నవంబర్ 1, 2026న నిర్వహించనున్న పోలింగ్‌కు సంబంధించి నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కెమెరాల పర్యవేక్షణతో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను అత్యంత భద్రత నడుమ ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తిరిగి తీసుకువచ్చి స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ పకడ్బందీ ఏర్పాట్లతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.
