గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఎన్నికల పోలింగ్ 56.15 శాతంతో ముగిసింది. మొత్తం 3,47,438 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం వార్డుల వారీగా వచ్చిన బ్యాలెట్ బాక్సులు, ఇతర ముఖ్యమైన ఎన్నికల సామగ్రిని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచారు.
ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి స్వీకరణ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారుల నుంచి నిర్దేశిత చెక్‌లిస్ట్ ప్రకారం మాత్రమే ఎన్నికల సామగ్రిని స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రిని అప్పగించేందుకు వచ్చిన సుమారు 6 వేల మంది సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్, సిబ్బందితో కలిసి భోజనం చేశారు. సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన కె. మయూర్ అశోక్, ఈ నెల 3వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.
