-తాగునీరు, పారిశుద్ధ్యం మరియు డ్రైనేజీ నిర్వహణపై ముందస్తు చర్యలు.
-సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి 0863 2345103 కాల్ సెంటర్
-కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
“మురసు” తుఫాన్ నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తాగునీటి రిజర్వాయర్ల వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య ఎదురైనా సరఫరాకి సమస్య రాకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని, నీటి సరఫరా జరిగే సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా ఉండేందుకు వీలుగా డ్రైన్లు, కల్వర్టులలో పూడికతీత పనులు పూర్తి చేయబడి ఉన్నాయని, ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అయితే తక్షణం తొలగించడానికి అవసరమైన జేసిబీలను సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే భారీ హోర్డింగ్స్ ని తొలగించామని, మరొక్కసారి పరిశీలించాలని, పాత భవనాల్లో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా తెలియచేయాలని టిపిబిఓలను ఆదేశించామన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి తగిన సామాగ్రితో బృందం సిద్దంగా ఉండేలా చూడాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. తుఫాన్ నేపధ్యంలో ప్రజలు కాచి వడకట్టిన నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగించాలని, అత్యవసర సహాయం కోసం జిఎంసి కంట్రోల్ రూమ్ 0863 2345103ను సంప్రదించవచ్చని తెలిపారు.
