-33 ఏళ్ల పాటు సమాచార శాఖకు విశిష్ట సేవలు.. పనితీరు, క్రమశిక్షణ అభినందనీయం: చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తన పనితీరు, అంకితభావంతో సీ.ఆర్. మీడియా అకాడమీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో మేడపాటి భాస్కర నారాయణ కీలక పాత్ర పోషించారని అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు.
అక్టోబర్ 31న డిప్యూటీ డైరెక్టర్ హోదాలో సీ.ఆర్. మీడియా అకాడమీ మేనేజర్‌గా పదవీ విరమణ చేసిన మేడపాటి భాస్కర నారాయణను సోమవారం అకాడమీ కార్యాలయంలో సమాచార శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత అధికారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆలపాటి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, భాస్కర నారాయణ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మృదు స్వభావంతో అకాడమీ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించారని కొనియాడారు. విధుల పట్ల ఏకాగ్రత, ఉన్నతాధికారుల పట్ల విధేయత ఆయనలోని ప్రత్యేక లక్షణాలని పేర్కొన్నారు. నిరంతరం ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమై పనిచేసిన వ్యక్తికి పదవీ విరమణ అనంతరం ఏర్పడే ఖాళీని అధిగమించడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. భాస్కర నారాయణ తన విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం సీ.ఆర్. మీడియా అకాడమీ తరఫున ఆయనను సత్కరించారు.
మృదు స్వభావం, క్రమశిక్షణ ఆయన ప్రత్యేకత
విశిష్ట అతిథిగా పాల్గొన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ మేడపాటి సత్యప్రకాష్ మాట్లాడుతూ, భాస్కర నారాయణ మృదు స్వభావి అని, తనకు అప్పగించిన పనులను పూర్తి క్రమశిక్షణతో నిర్వహించేవారని అన్నారు. సమాచార శాఖ అధికారుల అభిమానం పొందడం ఆయన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుని ప్రశాంతంగా పదవీ విరమణ చేయడం అదృష్టమని అభిప్రాయపడ్డారు.
విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ, సమాచార శాఖలో అప్పగించిన బాధ్యతలను భాస్కర నారాయణ సమర్థవంతంగా నిర్వహించేవారని, క్రమశిక్షణ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు.
మరో విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, వివిధ హోదాల్లో పనిచేస్తూ సమాచార శాఖ పేరు ప్రతిష్ఠలను పెంచేలా భాస్కర నారాయణ సేవలందించారని అన్నారు. ఆయన పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.
33 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న భాస్కర నారాయణ
ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన డిప్యూటీ డైరెక్టర్, సీ.ఆర్. మీడియా అకాడమీ మేనేజర్ ఎం. భాస్కర నారాయణ మాట్లాడుతూ, సమాచార శాఖలో 33 ఏళ్ల సుదీర్ఘ సేవా కాలంలో ఉన్నతాధికారుల ఆదేశాలను చిత్తశుద్ధితో అమలు చేశానని తెలిపారు.
పౌర సంబంధాల శాఖలో పనిచేయడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ వంటి ఉన్నతాధికారులతో సన్నిహితంగా విధులు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఉద్యోగంలో చేరిన రోజే పదవీ విరమణ తేదీ నిర్ణయించబడినప్పటికీ, ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగడం కొంత బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు.
తనపై ప్రేమాభిమానాలతో కార్యక్రమానికి హాజరై, తన సేవలను గుర్తుచేసుకుంటూ అభినందించి, సన్మానించిన అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అధికారుల అభినందనలు.. విశ్రాంత ఉద్యోగుల సంఘం సన్మానం
సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్లు షేక్ మహమ్మద్ బాషా, ఐ. సూర్య చంద్రరావు, పి. తిమ్మప్ప తదితరులు భాస్కర నారాయణ సేవలను, పనితీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అకౌంట్స్ అధికారిణి రజియా బేగం, జె.ఈ.ఓ. నాగరాజు, గుంటూరు డీడీ ఎల్. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు రాజశేఖర్, కె. నారాయణ రెడ్డి, తిరుపాల్, మోహనరావు, వీరభద్రరావు, ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్వో టి. నాగేశ్వరరావు, డీఐపీఆర్వో రమణ, డివిజనల్ పీఆర్వో రవి, ఏవీఎస్ వి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ తరఫున విశ్రాంత అడిషనల్ డైరెక్టర్లు ఎల్. స్వర్ణలత, పి. కిరణ్ కుమార్, ట్రెజరర్ ఎస్. శ్రీనివాస జీవన్, జి. వెంకటేశ్వరరావు భాస్కర నారాయణను ఘనంగా సన్మానించారు.
33 ఏళ్ల పాటు సమాచార శాఖకు సేవలందించిన భాస్కర నారాయణ పదవీ విరమణ సందర్భంగా సహచరులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.
