-ఒకే తరహా దరఖాస్తులతో అధికారుల సమయాన్ని, ప్రభుత్వ వనరులను వృథా చేయడం ప్రజాస్వామ్య హక్కు కాదు: రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
సమాచార హక్కు చట్టం (RTI) ప్రజలకు కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని, దానిని ప్రభుత్వ అధికారులను వేధించేందుకు లేదా ప్రభుత్వ యంత్రాంగంపై అనవసర ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన చట్టాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు, అధికారుల విధులకు ఆటంకం కలిగించేలా దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
సమాచార హక్కు చట్టం దుర్వినియోగంపై రాష్ట్ర సమాచార కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎస్. ముద్దు కొండయ్య దాఖలు చేసిన రెండవ అప్పీల్ నంబర్ 11323/2023తో పాటు బ్యాచ్‌లోని మరో ఎనిమిది రెండవ అప్పీళ్లను విచారించిన అనంతరం 2026 అక్టోబర్ 14న రాష్ట్ర సమాచార కమిషన్ ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకే తరహా ప్రశ్నావళితో వివిధ గ్రామాలు, మండలాలు, ప్రభుత్వ కార్యాలయాలకు పదేపదే సమాచార దరఖాస్తులు సమర్పించడం, వాటిపై వరుసగా అప్పీళ్లు దాఖలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలపై అనవసర పరిపాలనా భారం పడుతున్న విషయాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
ఒకే తరహా ప్రశ్నలతో పదేపదే దరఖాస్తులు
సంబంధిత ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు తమ వ్రాతపూర్వక సమర్పణలు, సమాచార సరఫరా వివరాలు, ఇతర రికార్డులను కమిషన్ ముందు ఉంచారు. విచారణకు నోటీసులు అందినప్పటికీ అప్పీలుదారుడు విచారణకు హాజరుకాలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివిధ గ్రామాలు, మండలాలకు సంబంధించిన పేర్లు, వివరాలను మాత్రమే మార్చి దాదాపు ఒకే తరహా ప్రశ్నావళితో అనేక సమాచార దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన కమిషన్
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు Central Board of Secondary Education v. Aditya Bandopadhyay (2011) 8 SCC 497 కేసులో చేసిన కీలక వ్యాఖ్యలను రాష్ట్ర సమాచార కమిషన్ ప్రస్తావించింది.
సమాచార హక్కు చట్టం నిజాయితీగా విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారుల సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే విధంగా మారకూడదనే న్యాయసూత్రాన్ని గుర్తుచేసింది.
పౌరులకు సమాచార హక్కును నిరాకరించలేమని, అయితే ఆ హక్కును చట్టం ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
పునరావృత దరఖాస్తులపై కీలక ఆదేశాలు
ఇప్పటికే పరిశీలించి పరిష్కరించిన లేదా గణనీయంగా సారూప్యత కలిగిన అంశాలపై మళ్లీ మళ్లీ సమాచార దరఖాస్తులు, మొదటి అప్పీళ్లు, రెండవ అప్పీళ్లు, ఫిర్యాదులు దాఖలు చేయకుండా అప్పీలుదారుడిని కమిషన్ తన ఉత్తర్వుల ద్వారా నిషేధించింది. ఈ విధానాన్ని కొనసాగిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ ఉత్తర్వుల ప్రతులను సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ అధికారిక వెబ్సైట్లో ‘MISUSE OF RTI’ శీర్షిక కింద పొందుపరచాలని ఆదేశించింది.
అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు, నోడల్ అధికారులకు ఉత్తర్వుల ప్రతులు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ రిజిస్ట్రీని ఆదేశించింది.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం
ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సమయం, వనరులు ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించబడేలా చూడటం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.
సమాచార హక్కును పరిరక్షిస్తూనే, దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర సమాచార కమిషన్ కట్టుబడి ఉందని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని కమిషనర్ పి.ఎస్. నాయుడు పేర్కొన్నారు.
