-మళ్లీ దానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహణ మరియు నమోదు కూడానా….?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షలు ఒకవైపు జరుపుతూ మరొకవైపు మూల్యాంకన విధులలో పాల్గొన్న దృష్ట్యా చాలా పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ జరగనే లేదు.మళ్లీ ఆ కోర్సు కు గ్రాండ్ టెస్టులు పెట్టమనడం ఫలితము లేని నిర్వహణ అని విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్.టి.యు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. బ్రిడ్జ్ కోర్స్ పుస్తకాలు కోర్సు ప్రారంభమైన చాలా రోజుల తర్వాత పాఠశాలలకు అందుబాటులోకి వచ్చాయని తీరా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు 10 వ తరగతి పరీక్షలు, మూల్యాంకన విధులలో నిమగ్నం అయ్యారని తెలిపారు. 9వ తరగతి పరీక్షలు ముందుకు జరిపి సరికొత్త ప్రయోగాన్ని అమలు చేశారని దీని ద్వారా ఫిబ్రవరి, మార్చి నెలలో విద్యార్థులు అధిక శాతం గైర్హాజరు అయ్యారని, బ్రిడ్జ్ కోర్సు పూర్తి సక్రమంగా అమలు జరగలేదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ ప్రణాళిక పేరుతో 100 రోజుల నుంచి విద్యార్థులను పూర్తిగా పాఠశాలకు పరిమితం చేస్తున్నారని దీని ద్వారా మిగతా తరగతులకు కాల నిర్ణయ పట్టిక అమలు సక్రమంగా జరగడం లేదని ఇలాంటి ప్రయోగాలు మానుకోవాలని, ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా బోధన చేసే అవకాశం ఇవ్వాలని, ఉపాధ్యాయులను నమ్మాలని, ప్రతిదానికి నమోదు మరియు ఫోటోలను కోరడం ఆపాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం కోరింది. 220 పని దినాల్లో 100 రోజులు కార్యాచరణ ప్రణాళిక కు కేటాయించి ప్రత్యేక సిలబస్ రూపొందించి వాటిని బోధించమనడం ద్వారా విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి మరియు పరీక్షల్లో ఆ ప్రశ్నలు రాకపోవడం ద్వారా మానసిక వ్యధకు గురవుతున్నారని వచ్చే విద్యా సంవత్సరం వీటన్నింటిని మానుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. మితిమీరిన ప్రయోగాలు పాఠశాల విద్యా వ్యవస్థ పైన చేయడం ద్వారా వ్యవస్థకు నష్టం వాటిల్లుతున్నదని వచ్చే విద్యా సంవత్సరం అలాగే కొనసాగితే విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనుకాడమని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి సాయి శ్రీనివాస్ హెచ్చరించారు.
Prajavartha Online Telugu News