-రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-కుటుంబ సమేతంగా హాజరై మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు
-హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ బాలశౌరి, ఇతర ప్రజాప్రతినిధులు
– గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
మొవ్వ/పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చి దూప, దీప నైవేద్యాలతో, ఆధ్యాత్మికతతో కళకళలాడేవిధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు..
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో బాలా త్రిపురీ శ్రీముఖలింగేశ్వర స్వామి వారి నూతన విగ్రహం, ద్వజ స్థంభ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంత్రి పార్థసారథి సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు వేద పండితులు ‘పూర్ణకుంభం’తో ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన మంత్రి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం, ప్రతిష్టాపన పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు మంత్రి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనాలు పలికారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించబడిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రతి ఆలయాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి.. ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడేలా, ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సేవలు మరింత విస్తరించేలా ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినప్పుడే ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఆలయాలు భారతీయ జీవన విధానానికి ప్రతీకలని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఈ దేవస్థానం ఈ ప్రాంతంలోనే స్థానికంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయు:రారోగ్యాలతో, పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పించి ఈ రాజశ్యామల యజ్ఞయం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కోసం ప్రత్యేకంగా పూజలు:
మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, రాష్ట్ర ప్రగతికి ఆయన చేస్తున్న కృషి మరింత సఫలం కావాలని కోరుతూ రాజశ్యామల యాగం నిర్వహించామన్నారు. భవిష్యత్ లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేలా ప్రత్యేక పూజలు చేశామన్నారు.
కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కారకంపాడు పరిసర గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Prajavartha Online Telugu News