అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.
