-ఈ నెల 18 లోపు ఎన్నికైన మేయర్లు, చైర్పర్సన్లు, వార్డు సభ్యులకు ఎన్నికల నోటీసు జారీ…
-నవంబర్ 23 వ తేదీన డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణ
-పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 87 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు.
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారని, అనంతరం 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారని ఆయన తెలిపారు.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, చైర్పర్సన్లు, మేయర్ లు ఎన్నికైన ఒక వార్డు సభ్యున్ని డిప్యూటీ మేయర్ గా, వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోనున్నారని ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా నిర్ణీత తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ పునేఠా సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు: 87
మున్సిపల్ కార్పొరేషన్లు: 13
ఎన్నికల నోటీసు జారీ: 18.11.2026 లోపు
పరోక్ష ఎన్నికల నిర్వహణ: 23.11.2026
ఏదైనా అనివార్య కారణాల వల్ల నవంబర్ 23 వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే ఆ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 24 తేదీన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు.
మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ షెడ్యూల్ కీలకంగా మారనుందని ఈ ఎన్నికలతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ మరింత ముందుకు సాగనుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పిలుపునిచ్చారు.
