-కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వస్త్ర వ్యాపారుల ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో వ్యాపార రంగం కుదేలై, వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వస్త్రాలపై ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని 12 శాతానికి పెంచడాన్ని విరమించుకోవాలని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. వస్త్రాలపై ఇప్పటివరకు ఉన్న 5 శాతం జిఎస్‌టిని 12 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పంజా సెంటర్‌లో గల కృష్ణావేణి హాోల్‌సేల్ క్లాత్ మార్కెట్ వద్ద వ్యాపారులు, గుమస్తాలు నల్ల బ్యాడ్జీలు ధరించి, బ్యానర్, ప్ల కార్డులు చేతబూని ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ అధ్యక్షులు బచ్చు వెంకట లక్ష్మీవరప్రసాద్ మాట్లాడుతూ వస్త్రాలు (బట్టలు) అనేవి ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. అందుకే కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని మన పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. అటువంటి వస్త్ర రంగంపై వ్యాట్ ట్యాక్స్‌లు పెంచటమంటే ప్రజలపై భారాలు వేయటమే అన్నారు. కరోనాతో కర్ఫ్యూతో కొంతకాలం షాపులు మూతపడి వ్యాపార రంగం దెబ్బతిందన్నారు. ఇప్పటికే వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామని, తాజాగా కేంద్రం 2022 జనవరి 1 నుంచి ఐదు శాతంగా వున్న జియస్టీని 12 శాతానికి పెంచాలని నిర్ణయాన్ని మా వ్యాపారులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ రకంగా వస్త్రాలపై జిఎస్‌టి పెంచితే అది వినియోగదారులపై కూడా రెట్టింపు భారం పడుతుందని తెలిపారు. ఐదు శాతం జియస్టీ తగ్గించమంటే, 12 శాతం పెంచడం ఎంతవరకు సబబు అన్నారు. ఐదు లక్షల సరుకు కొనుగోలు చేస్తే సుమారు రూ. 60 వేలు వేలు జియస్టీ కట్టాల్సి వస్తుందని, ఇలా అయితే వస్త్ర రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల టెక్స్‌టైల్ రంగం మూతపడే ప్రమాదం వుందని, దీంతో అందులో పనిచేసే వేలాదిమంది కార్మికులు, షాపుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు బజారుపాలు కావల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై దేశవ్యాప్తంగా పెంచిన జిఎస్‌టి విషయంలో పునరాలోచన చేసి పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో వ్యాపారులు మరిన్ని పోరాటాలు చేయాల్సి వస్తుందని బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, వల్లంకొండ బ్రహ్మానందం, జాయింట్ సెక్రటరీ వాగిచర్ల బాలప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెలంపల్లి రాఘవ నర్సింహారావు, ఏపి టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ సెక్రటరీ బిజెపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.