ఎన్నికల అనంతరం నగరాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

-శాఖాధిపతుల సమీక్ష సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వివిధ శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని కమిషనర్ అభినందించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇకపై నగరంలో పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రీనరీ పెంపుదల, ప్రజారోగ్యం తదితర సాధారణ పరిపాలనా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా పన్నుల వసూళ్లపై దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. నగరంలో చెత్త సేకరణలో ఎటువంటి లోపాలు లేకుండా, ప్రతి ఇంటి నుంచి డోర్ టు డోర్ చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులను ప్రతిరోజూ శుభ్రపరిచేలా వియంసి వాహనాలను సమర్థవంతంగా వినియోగించాలని, ఈ ప్రక్రియను ప్రజారోగ్య శాఖాధిపతి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. నగరంలో గ్రీనరీని మరింత పెంపొందించేలా మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. నగర పరిధిలో అనధికార నిర్మాణాలు జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, కె. శకుంతల, డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నడుముల గ్లోరీ, జోనల్ కమిషనర్లు కె. ప్రభుదాస్, కేశాంబి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఆర్.ఎఫ్.ఓ. సి.హెచ్. రత్నబాబు, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.