ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు

-11 కళాశాలల్లో 15 వైద్య విభాగాల్లో సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు
-163 సీట్లకు ప్రతిపాదనలు.. 98.77 శాతం సాధన
-మెరిట్ విద్యార్థులకు పీజీ వైద్య విద్య మరింత చేరువ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 161 కొత్త పీజీ వైద్య సీట్లను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. మొత్తం 15 స్పెషాలిటీల్లో ఈ సీట్లు వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి 163 సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎన్ఎంసీ 161 సీట్ల (98.77 శాతం)కు అనుమతించింది. కూటమి ప్రభుత్వం సదరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను కల్పించడం ద్వారా 161 సీట్లు అదనంగా రావడంతో మెరిట్ విద్యార్థులకు పీజీ వైద్య విద్య మరింత చేరువైంది.

ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు

వైద్య విభాగాల వారీగా ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖ వ్యాధుల విభాగం (డీవీఎల్‌), ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాల్లో 16 చొప్పున, రేడియో డయాగ్నోసిస్‌ 14, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ విభాగాల్లో 12 చొప్పున, జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌ విభాగాల్లో 8 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ప్రసూతి, గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్‌ ఆంకాలజీ విభాగాల్లో 4 చొప్పున సీట్లు లభించాయి. ఎమర్జెన్సీ మెడిసిన్‌, రెస్పిరేటరీ మెడిసిన్‌, సైకియాట్రీ, రేడియేషన్‌ ఆంకాలజీ విభాగాల్లో మంజూరైన సీట్లు అత్యవసర చికిత్స, శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్‌ చికిత్స వంటి ప్రాధాన్య రంగాల్లో వైద్య నిపుణుల సంఖ్యను పెంచనున్నాయి. ప్రస్తుతం మంజూరైన 161 సీట్లను 2026–27 విద్యా సంవత్సర పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు.
కిందటి విద్యా సంవత్సరంలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి మొత్తం 150 పీజీ వైద్య విద్య సీట్ల మంజూరుకు దరఖాస్తులు వెళ్లాయి. వీటి పరిశీలన అనంతరం ఎన్ఎంసి 142 సీట్లను మంజూరు చేసింది.