యువతకు పార్లమెంటులో తమ గళాన్ని వినిపించే అవకాశం – వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు

-18–25 సంవత్సరాల యువతకు ఆహ్వానం – రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, జాతీయ సమగ్రత పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – 2027 (జాతీయ యువజనోత్సవం) లో భాగంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని PSCMR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో 2026, నవంబర్ 10వ తేదీన ఉదయం 9.00 గంటల నుంచి ఈ పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీలకు “ఒకే దేశం – ఒకే ఎన్నికలు (One Nation, One Election)” అనే అంశాన్ని కేటాయించారు. ఈ అంశంపై యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణాత్మక దృక్పథాన్ని సభా వేదికపై వ్యక్తపరిచే అవకాశం కల్పించనున్నారు.
ఈ పోటీలకు సంబంధించిన గోడపత్రికలను ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ జిల్లా అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య చర్చల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

పోటీలకు అర్హతలు మరియు ముఖ్య సూచనలు:

1. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు.
2. పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలి.
3. నవంబర్ 10వ తేదీన ఉదయం 09.00 గంటలకల్లా PSCMR కాలేజ్ ప్రాంగణానికి చేరుకోవాలి.
4. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలు తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారు.
5. రాష్ట్ర స్థాయిలో అర్హత సాధించిన యువతకు జాతీయ స్థాయిలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుసుకుని, ముఖాముఖి సంభాషించే అరుదైన అవకాశం కూడా లభించవచ్చు.

దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, విధాన నిర్ణయాల్లో యువత భాగస్వామ్యం వంటి అంశాలపై తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పోటీలు ఒక గొప్ప వేదికగా నిలవనున్నాయి.

కావున ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలోని 18–25 సంవత్సరాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని MY Bharat – NTR జిల్లా కార్యాలయం విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9640488813