-ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది కౌంటింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ శాఖ అధికారులు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, ఓటర్లు, ప్రజలు ఎన్నికల నిర్వహణకు అందించిన సహకారాన్ని అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సమన్వయం, సహకారం కొనసాగించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.
