ప్రభుత్వ దరఖాస్తులు, అధికారిక రికార్డుల్లో తండ్రి పేరు తప్పనిసరి

-నిబంధనను తొలగించాలి చట్టపరంగా అవసరం లేని చోట తల్లి లేదా చట్టబద్ధ సంరక్షకుల పేరును ప్రత్యామ్నాయంగా అనుమతించాలి
-తండ్రి పేరు లేని కారణంగా ఏ చిన్నారికీ విద్య, సంక్షేమ పథకాలు, గుర్తింపు పత్రాలు, ఇతర సేవలు దూరం కాకూడదు
-పిల్లల హక్కులు, గౌరవం, సమానత్వం, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ శాఖలు విధివిధానాలను రూపొందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ శాఖల దరఖాస్తులు, అధికారిక రికార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో చట్టపరంగా తప్పనిసరి కాని సందర్భాల్లో తండ్రి పేరు నమోదు చేయాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) పిలుపునిచ్చింది. తండ్రి వివరాలు లేవనే కారణంతో ఏ చిన్నారికీ విద్య, గుర్తింపు పత్రాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సేవలు అందకుండా చేయకూడదని స్పష్టం చేసింది.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో మంగళవారం చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించడం’ అనే అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న AP SCPCR చైర్మన్ వెటుకూరి ఏ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ… ప్రతి చిన్నారికి స్వతంత్ర హక్కులు, గౌరవం, గుర్తింపు ఉంటాయని, తల్లిదండ్రుల వైవాహిక స్థితి, కుటుంబ పరిస్థితులు, సామాజిక నేపథ్యం ఆధారంగా పిల్లల భవిష్యత్తు నిర్ణయించరాదని పేర్కొన్నారు. పిల్లల గౌరవం, సమానత్వం, వ్యక్తిగత గుర్తింపు, ప్రాథమిక హక్కులకు ప్రభుత్వ పరిపాలనా విధానాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కన్వెన్షన్ (UNCRC) లోని ఆర్టికల్స్ 2, 3, 7, 8, 12, 16, 28లను ప్రస్తావిస్తూ… వివక్షకు తావులేకుండా చూడటం, బాలల సంక్షేమానికి ప్రాధాన్యత, గుర్తింపు హక్కు, అభిప్రాయ వ్యక్తీకరణ, వ్యక్తిగత గోప్యత, విద్యా హక్కులను ఈ నిబంధనలు పరిరక్షిస్తున్నాయన్నారు.

ఒంటరి తల్లులు, అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, మానవ అక్రమ రవాణా, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ బాధితులు, చట్టబద్ధ సంరక్షకుల వద్ద పెరుగుతున్న పిల్లలు ప్రభుత్వ దరఖాస్తుల్లో తండ్రి పేరు తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్మన్ పేర్కొన్నారు.
తండ్రి పేరు తప్పనిసరి చేయడం వల్ల జనన ధ్రువీకరణ పత్రాలు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉపకార వేతనాలు, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో అనవసరమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తల్లులు తమ కుటుంబ పరిస్థితులను పదేపదే వెల్లడించాల్సి రావడం, అర్హత నిరూపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమన్నారు.

ప్రభుత్వ దరఖాస్తులు, రికార్డులు పిల్లలకు హక్కులు, సేవలు అందించే మార్గాలుగా ఉండాలే తప్ప, వారి అభివృద్ధికి అడ్డంకులుగా మారకూడదని స్పష్టం చేశారు.

కార్యశాలలో చేసిన ప్రధాన సూచనలు:

చట్టపరంగా తప్పనిసరి కాని చోట ప్రభుత్వ దరఖాస్తుల్లో తండ్రి పేరు నమోదు చేయడాన్ని తప్పనిసరి నిబంధనగా తొలగించాలి.

తండ్రి పేరుకు బదులుగా తల్లి పేరు లేదా చట్టబద్ధంగా గుర్తింపు పొందిన సంరక్షకుల వివరాలను ప్రత్యామ్నాయంగా అనుమతించాలి.

తండ్రి పేరు లేదనే కారణంతో ఏ చిన్నారికీ పాఠశాల ప్రవేశాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సేవలను నిరాకరించకూడదు.

ప్రభుత్వ దరఖాస్తు ఫారాలు, డేటాబేస్‌లు, ఆన్‌లైన్ పోర్టళ్లలో అవసరమైన మార్పులు చేపట్టాలి.

జిల్లా, మండల, క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయాలి.

తండ్రి పేరు నమోదు చేయలేదనే కారణంతో సేవలు నిరాకరించిన సందర్భాల్లో ఫిర్యాదులను పరిష్కరించేందుకు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

క్షేత్రస్థాయి అధికారులకు ఈ అంశంపై విస్తృత అవగాహన కల్పించాలి.

పిల్లల కుటుంబ పరిస్థితుల గురించి పదేపదే ప్రశ్నించడం వల్ల వారిలో కలిగే మానసిక ఆందోళన, అవమాన భావన, సామాజిక వివక్షను నివారించాలని, వారి వ్యక్తిగత గోప్యతను కాపాడాలని చైర్మన్ సూచించారు.

శాఖల మధ్య సమన్వయంతో ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకురావాలి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ చిన్నారికీ విద్య, అవకాశాలు దూరం కాకుండా సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కుటుంబ పరిస్థితులతో సంబంధం లేకుండా మహిళలు, పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే విధమైన బాలల హిత పరిపాలనా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని కార్యశాల సందర్భంగా చర్చించారు. ఆయా శాఖలు నిర్దిష్టమైన సిఫార్సులను రూపొందించాలని, నోడల్ అధికారులను నియమించాలని, నిర్ణీత కాలపరిమితితో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చైర్మన్ సూచించారు.

తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించడం అంటే తండ్రులను మినహాయించడం లేదా చట్టబద్ధమైన తల్లిదండ్రుల హక్కులు, బాధ్యతలను నిరాకరించడం కాదని కమిషన్ స్పష్టం చేసింది. వర్తించే చట్టాలకు అనుగుణంగా ప్రతి చిన్నారి గౌరవం, సమానత్వం, గుర్తింపు హక్కులను పరిరక్షించేందుకు చేపట్టే సమ్మిళిత పరిపాలనా సంస్కరణగా దీనిని అభివర్ణించింది.

ప్రభుత్వ పత్రంలో తండ్రి పేరు లేదనే కారణంతో ఏ చిన్నారి భవిష్యత్తుకూ ఆటంకం కలగకూడదు. తమ హక్కులను పొందేందుకు ముందు పిల్లలు తమ కుటుంబ పరిస్థితుల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత గోప్యత, బాలల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలు సున్నితంగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు.

చట్టపరంగా అనుమతించబడిన అన్ని సందర్భాల్లోనూ బాలల హిత డాక్యుమెంటేషన్ విధానాలను అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించేలా సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వు (GO) లేదా పరిపాలనా సర్క్యులర్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

UNCRC లో పొందుపరిచిన బాలల హక్కుల సూత్రాలను ఆచరణలోకి తీసుకురావడం, సమ్మిళిత, సున్నితమైన, బాలల హిత పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు.

వర్క్ షాప్ లో కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి ఎం కె. విజయలక్ష్మి, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, జువైనల్ వెల్ఫేర్ శాఖకు చెందిన పి. రమణారెడ్డి, డైరెక్టర్ DOJW, ఆంధ్రప్రదేశ్ వసంతబాల, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, DWCD జాయింట్ డైరెక్టర్ శిరీష, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వి.ఎస్. సుబ్బారావు, ఏలూరు CWC చైర్‌పర్సన్ పి.వి. రావు, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ కుమార్, HELP డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రామ్మోహన్, AP SCPCR సభ్యులు వి. గాంధీబాబు, చల్లా మధుసూదనరావు, పి. నాగమానస, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ జెనిఫర్ వై, వివిధ జిల్లాల CWC చైర్‌పర్సన్లు, కమిషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.