విజయవాడలో విజయవంతంగా నిర్వహించిన వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ – 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యువతలో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ – 2026 జిల్లా స్థాయి పోటీలు నవంబర్ 10న విజయవాడలోని PSCMR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 45 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” (ఒక దేశం – ఒకే ఎన్నిక) అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను, విశ్లేషణాత్మక దృక్పథాన్ని సమర్థవంతంగా వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధి అధికారి మధు భూషణ్ రావు, NTR జిల్లా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. రమేష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ఎస్ జే కార్యక్రమ నిర్వాహకులు డా. పిటి పార్కర్, పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. PSCMR కళాశాల ప్రిన్సిపాల్ డా. శరవణ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలు:

ప్రథమ బహుమతి: లక్ష్మీ ప్రియ – PB సిద్ధార్థ కళాశాల.

ద్వితీయ బహుమతి: నవీనానంది – మారిస్ స్టెల్లా కళాశాల.

తృతీయ బహుమతి: అమృత్ – KBN కళాశాల.

విజేతలకు అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY Bharat నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు యువతలో ప్రజాస్వామ్య స్పృహను, నాయకత్వ సామర్థ్యాన్ని, జాతీయ సమగ్రత పట్ల నిబద్ధతను పెంపొందించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.