-ఫలించిన మంత్రి సవిత కృషి
-2 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
-ఐటీఐ ఏర్పాటుతో స్థానిక యువతకు ఎంతో మేలు
-కియా, అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
-సీఎం చంద్రబాబుకు, మంత్రిమండలికి మంత్రి సవిత ధన్యవాదాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా యువతకు మేలు కలిగేలా మంత్రి సవితమ్మ చేసిన కృషి ఫలించింది. పెనుకొండలో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయిస్తూ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెనుకొండ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1245-1లో ఉన్న రెండు ఎకరాల భూమిని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కేటాయించనున్నారు. ఐటీఐ కళాశాల ఏర్పాటుతో పదో తరగతి పూర్తి చేసుకున్న యువతకు వృత్తి, సాంకేతిక పరమైన విద్య అందించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కియా, దాని అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కళాశాల ఏర్పాటుతో పెనుకొండ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్య, వృత్తి విద్య లో శిక్షణ పొందే అవకాశం లభించనుందని మంత్రి సవిత తెలిపారు.
స్థానికంగానే ఉద్యోగావకాశాలు
ఐటీఐ ఏర్పాటుతో వృత్తి, సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు స్థానింగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో కియా, దాని అనుబంధ పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటువుతున్నాయన్నారు. ఆయా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందన్నారు. ఐటీఐ శిక్షణ పొందిన విద్యార్థులకు ఆ పరిశ్రమల్లో సులభంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఎంతో మేలు కలుగునుందన్నారు. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు, ఇతర సహచర మంత్రివర్గ సభ్యులకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
