-ధాన్యం కొనుగోలు చేయలేని దీన స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం
-మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాలి కానీ కల్లాల్లోనే లక్షల టన్నుల ధాన్యం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాల్సి ఉన్నా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ప్రస్తుతం రోజుకు 10 వేల టన్నులు మాత్రమే సేకరిస్తున్నారని, దీంతో రాష్ట్రంలో లక్షలాది టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉందన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం 8,789 ఆర్బికెలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో కొనుగోలు పూర్తి మందకొడిగా సాగుతోందన్నారు. ఖరీఫ్ 2015-16లో 44.01 లక్షలు, 2016-17లో 38.62 లక్షలు, 2017-18లో 41.59 లక్షలు, 2018-19లో 44.45 లక్షలు, 2019-20లో 47.83 లక్షలు, 2020-21లో 47.32 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, గత రెండు సంవత్సరాల్లో ఫిబ్రవరి 25 నాటికి ఖరీఫ్ ధాన్యం సేకరణ వివరాలు పరిశీలిస్తే 2019-20లో 42.56 లక్షలు, 2020-21లో 39.94 లక్షల టన్నులు సేకరించారని, ఈ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి ఫిబ్రవరి 25 నాటికి 35.94 లక్షలే కొనుగోలు చేశారని తులసి రెడ్డి చెప్పారు.
గతేడాదితో పోలిస్తే నాలుగు లక్షల టన్నులు, 2019-20తో పోలిస్తే 6.62 లక్షల టన్నులు సేకరణలో పౌరసరఫరాల సంస్థ వెనుకబడిందని, నిధులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, నెల రోజుల నుండి డబ్బులు చెల్లించే ప్రక్రియ నిలిచిపోవడంతో సేకరణనూ అధికారులు నిలిపివేశారని తులసి రెడ్డి అన్నారు. ఈ సీజన్లో మార్చి 22 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 36.18 లక్షల టన్నులు మాత్రమే సేకరించారని, మరో 23 రోజుల్లో 13.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సిఉందని, రోజుకు దాదాపుగా 60 వేల టన్నుల ధాన్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని అన్నారు. తక్షణమే రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.