-వదిలివేసిన శిశువుల సమాచారం 1098కు తెలియజేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ దత్తత అవగాహన మాసం సందర్భంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యాన గుంటూరు రైల్వే స్టేషన్లో రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు చట్టబద్ధ దత్తత ప్రక్రియ, ఉయ్యాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎక్కడైనా వదిలివేయబడిన శిశువులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు లేదా జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అర్హులైన దంపతులు, తల్లిదండ్రులు చట్టబద్ధమైన దత్తత విధానాల ద్వారానే పిల్లలను దత్తత తీసుకోవాలని సూచించారు. అలాగే, బాల్య వివాహ రహిత భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణ, బాల్య వివాహాలు నిర్వహించిన వారిపై తీసుకునే చట్టపరమైన చర్యల గురించి వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆపదలో ఉన్న బాలల వివరాలను చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు తెలియజేస్తే వారికి అవసరమైన రక్షణ, సంరక్షణ కల్పిస్తామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి టీ. దుర్గాభవాని, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ఏ. సాయికృష్ణ, సూపర్వైజర్ సావిత్రి, చల్సియా, సరిత, స్టేషన్ మాస్టర్ జి. నాగేశ్వరరావు, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
