-మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు: విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈ వాయుగుండం ఏ దిశగా పయనిస్తుందనే అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌పై ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం లేదని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.
