-ఎన్నికల వ్యయ నియంత్రణ, ప్రలోభాల నివారణపై ప్రత్యేక నిఘా ఉంచాలి
-రాష్ట్ర ఎన్నికల సంఘం వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 13, 2026న సమగ్ర నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు చేపట్టాల్సిన విధులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులకు లోబడి ఖర్చు చేసేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అభ్యర్థుల వ్యయ రిజిస్టర్లతో పాటు షాడో రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహిస్తూ, నిర్ణీత గడువులో వ్యయ వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం, బహుమతులు, ఇతర కానుకల పంపిణీ వంటి ప్రలోభాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ బృందాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఎన్నికల సభలు, ర్యాలీలు, వాహనాల వినియోగం, ప్రచార సామగ్రికి సంబంధించిన అనుమతులను నిశితంగా పరిశీలించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బి.విజయ కుమార్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
