-నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి – జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి జ్ఞానక్షేత్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్స్ ప్రచార కార్యదర్శి, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కవిత, కరస్పాండెంట్ సంతోష్‌లతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించింది.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని, కొత్త ఆలోచనలు, ప్రయోగాలు, పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సహజంగా ఉండే సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు అద్భుతమైన వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు, వినూత్న పరికరాలు, నమూనాలను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు. వాటి పనితీరు, ఉపయోగాలు, రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే వినూత్న ఆలోచనలతో అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలను మరిన్ని పాఠశాలల్లో విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. వివిధ పాఠశాలల మధ్య అంతర్ పాఠశాల సైన్స్ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందుతుందని, తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు ఇతరుల ఆలోచనల నుంచి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులలోని ప్రతిభకు సరైన ప్రోత్సాహం, నూతన ఆలోచనలకు తగిన వేదిక కల్పిస్తే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తయారవుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
