గిగ్ వర్కర్లతో కలిసి భోజనం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
హైదరాబాద్ కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నగర్‌లో గిగ్ వర్కర్ల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన UPZY హౌస్ ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సందర్శించారు. ఆదిత్య, నిరంజన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కేంద్రం హైదరాబాద్‌లోనే తొలి బ్రాంచ్‌గా నిలిచింది. స్విగ్గీ, జొమాటో, ఫస్ట్ క్లబ్, జుపిటో, బ్లాంకెట్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ UPZY నిర్వాహకులతో కలిసి గిగ్ వర్కర్లతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారితో కలిసి భోజనం చేశారు. డెలివరీ సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఈ కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, వినోదం కోసం ఆటలు, అత్యవసర వైద్య సేవలు, నగదు బదిలీ సదుపాయాలతో పాటు వారానికి కేవలం రూ.99 చెల్లించి అపరిమిత భోజనం పొందే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
నిరంతరం ప్రజలకు సేవలందించే గిగ్ వర్కర్ల సంక్షేమం, సౌకర్యాల కోసం ఇలాంటి కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.