స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు : బోడె రామచంద్ర యాదవ్

మంగళగిరి :
స్థానిక ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేసిందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
స్థానిక ఎన్నికల వ్యవహారంలో చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య లోపాయికారీ సంబంధాలున్నాయనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి, వైఎస్సార్‌సీపీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, దాచేపల్లిలో మైహోమ్ రామేశ్వరరావుకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా బీసీవై పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హక్కుల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాబోయే రోజుల్లో కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ప్రకటించారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ ప్రత్యేక అధ్యాయం సృష్టిస్తుందని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.