-ప్రసవ గడువు దగ్గరపడిన 3,478 మంది గర్భిణుల గుర్తింపు
-699 వైద్య బృందాలు సిద్ధం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వం మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ప్రసవ గడువు ఉన్న 3,478 మంది గర్భిణులను గుర్తించగా.. వారిలో 377 మందిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు ఆసుపత్రులకు తరలించిన గర్భిణుల్లో 171 మంది ప్రసవించారు. తుపాను సమయంలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. తుపాను ప్రభావిత 15 జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ సమస్తం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 994 ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఉండగా.. వాటిలో 282 వైద్య కేంద్రాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. 699 వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు (102), సంచార వైద్య వాహనాలు (104) అందుబాటులో ఉంచారు. 88 తీర ప్రాంత ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. 955 వైద్య కేంద్రాల్లో విద్యుత్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ చేపట్టిన తుపాను సన్నద్ధత, గర్భిణుల తరలింపు, అత్యవసర వైద్య ఏర్పాట్ల వివరాలను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు వెల్లడించారు.
