-మూడున్నర కోట్ల హిమోగ్లోబిన్ స్ట్రిప్స్ కొనుగోలుకు సూత్రప్రాయ అంగీకారం
-ముడిసరకుల ధరల పెంపుతో పెరిగిన మందుల రేట్లు
-టెండర్ల నిర్ణయాల్లో పైరవీలు, బెదిరింపులకు లొంగవద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ వైద్యారోగ్య సేవలకు అవసరమైన 31 రకాల మందులు, ఇతర అవసరాల కోసం సుమారు రూ. 75 కోట్లు వెచ్చించేందుకు వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్లను పరిశీలించి నియమాల మేరకు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోనే బిఎఫ్సి (బిడ్ ఫైనలైజేషన్ కమిటీ) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కొనుగోళ్ల వివరాలు
నులిపురుగుల నివారణ కోసం రూ.7.52 కోట్ల వ్యయంతో 6 కోట్ల 51 లక్షల అల్బెండొజోల్ మాత్రల కొనుగోలును బిఎఫ్సి ఆమోదించింది. జ్వర నివారణ నిమిత్తం రూ. 3.18 కోట్ల వ్యయంతో 9 కోట్ల 61 లక్షల పేరసెటమాల్ 500 ఎం.జి మాత్రలను, గుండె ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి రూ. 1.50 కోట్ల వ్యయంతో 17 లక్షల 90 వేలు హైడ్రోకార్టిజోన్ ఇంజక్షన్లను కొనుగోలు చేస్తారు. ఈ రీతిన రేట్ కాంట్రాక్టు పద్ధతిలో రెండేళ్లలో 26 రకాల మందుల కోసం సుమారు రూ. 29 కోట్ల వ్యయం కానుంది. దీనికి అదనంగా మరో 5 రకాల మందులను మూడు నెలల అవసరాల కోసం సుమారు రూ. 15 కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తారు. ముడిసరకుల ధరలు పెరగడంతో ఈ మందుల రేట్లు కొంతమేర పెరిగినట్లు బిఎఫ్సి తెలిపింది.
మూడున్నర కోట్ల హెచ్బి స్ట్రిప్స్ కొనుగోలు
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సూచించే మూడున్నర కోట్ల డిజిటల్ ఇన్వేజివ్ హిమోగ్లోబిన్ స్ట్రిప్స్ కొనుగోలుకు బిఎఫ్సి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎల్-1 టెండర్ ధర మేరకు ఇందుకు మొత్తం వ్యయం అంచనా దాదాపు రూ. 33 కోట్లు. వీటి సరఫరా కోసం రెండు బిడ్లు రాగా సాంకేతిక కారణాల వల్ల ఒకే బిడ్ అర్హత పొందింది. ఈ బిడ్ ధర ఒక్కో స్ట్రిప్‌కు రూ. 9.45. టెండర్ నియమాల మేరకు సిడియస్సిఓ క్లాస్-సి సర్టిఫికెట్, విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన ఐఇసి సర్టిఫికెట్, ఖచ్చితత్వ నిర్ధారణకు అవసరమైన పబ్లికేషన్లు, ఆటోమేటెడ్ డేటా ట్రాన్స్ఫర్, ఎబిడిఎం అనుగుణతకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందుపర్చనందున రెండో బిడ్ అనర్హతకు గురైంది.
2023 టెండర్లలో ఒక్క స్ట్రిప్ రూ. 6.36 చొప్పున ఈ స్ట్రిప్‌లను సరఫరా చేసిన వ్రిగ్ నేనో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన బిడ్ సాంకేతిక అర్హతను పొందింది. ప్రస్తుత టెండర్లలో అనర్హతకు గురైన కంపెనీ గత టెండర్లలో స్ట్రిప్‌కు రూ. 6.38 చొప్పున ఎల్-2 గా నిలిచింది. ప్రస్తుత టెండర్లలో ఎల్-1 గా నిలిచిన కంపెనీ కోట్ చేసిన ధరపై ఆ కంపెనీతో చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకోవాలని బిఎఫ్సి నిర్ణయించింది.
ధర పెరుగుదలకు కారణాలు
గతానికి భిన్నంగా…అధునాతన పరికరాలు, డిజిటల్ అనుసంధానం, ఆటో డిస్పోజబుల్ లాన్సెట్లు ( రక్త సేకరణకు ఉపయోగించే సూదులు), శిక్షణ మరియు సాంకేతిక సేవలతో కూడిన సమగ్ర డిజిటల్ హిమోగ్లోబిన్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత టెండర్‌ను రూపొందించడంతో గత కంటేను, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుత స్ట్రిప్ ధర కొంత మేరకు పెరిగింది.
గతంలోనూ, ధర తక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ హిమోగ్లోబిన్ స్ట్రిప్స్ తో పాటు రక్త సేకరణకు ట్విస్ట్ ల్యాన్సెట్లను కొనుగోలు చేయడం జరిగింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించే వీలున్న ఈ సూదుల ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలున్నందున…అలా వీలుకాని ధర ఎక్కువైన ఆటోమేటిక్ డిజేబుల్డ్ ల్యాన్సెట్లను ప్రస్తుత టెండర్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతంది. దీనికి అదనంగా ప్రతి 1500 స్ట్రిప్స్ కొనుగోలుకు దాదాపు రూ. 2,700 ఖరీదు చేసే ఒక హిమోగ్లోబినో మీటరు ప్రభుత్వానికి ఉచితంగా లభిస్తుంది. ప్రజల్లో హిమోగ్లోబిన్ స్థాయిపై రాష్ట్ర వ్యాప్త ట్రాకింగ్ కోసం ఈ స్ట్రిప్ ఎబిడిఎంకు అనుగుణంగా పనిచేస్తుంది. తద్వారా నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా డేటా అనుసంధానం వీలవుతుంది. మీటర్లు, స్ట్రిప్‌ల వినియోగంపై దాదాపు 25,000 మంది ఏఎన్ఎంలు, ఎమ్ఎల్హెచ్పిలకు ఎంపికైన సరఫరా కంపెనీ రెండు సార్లు శిక్షణ ఇస్తారు. ఇటువంటి నిబంధనలు లేని రాష్ట్రాల్లో స్ట్రిప్ ధర సహజంగానే తక్కువగా ఉంటుందని అధికారులు వివరించారు.
బెదిరింపులకు భయపడొద్దన్న మంత్రి
వైద్యారోగ్య శాఖకు సంబంధించిన టెండర్ల నిర్ణయాక విషయంలో కొంతమంది పాత్రికేయులు తరచుగా జోక్యం చేసుకుంటూ, తమను పదే పదే బెదిరింపులకు గురిచేస్తున్నారని సంబంధిత అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత టెండర్ విషయంలో కూడా అనర్హతకు గురైన కంపెనీని ఏదో విధంగా పరిగణలోకి తీసుకుని సప్లై ఆర్డర్ వచ్చేలా చూడాలని, లేకుంటే వ్యతిరేక వార్తలు రాస్తామని బెదిరించారని అధికారులు తెలిపారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన మంత్రి అట్టి పైరవీలకు తావివ్వకుండా, బెదిరింపులకు వెరవకుండా నియమాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మున్ముందు అలాంటి సమస్యలు ఎదురైతే ఆయా యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లామని మంత్రి అన్నారు.
