-జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు కథల పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కథలు చెప్పే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ మేనేజర్ సింహాద్రి రామలింగేశ్వరరావు ఆకస్మికంగా విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కథల పోటీలు పిల్లల్లో దాగి ఉన్న రచనా ప్రతిభను వెలికితీయడంతో పాటు భావితరాల్లో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కథలు చెప్పాలని కోరగా, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారికి నగదు బహుమతులు అందజేశారు. ఆ నగదుతో మంచి కథల పుస్తకాలు కొనుగోలు చేసుకుని, వాటిని చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి సింహాద్రి రామలింగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రంథాలయ సిబ్బంది వై. ధనలక్ష్మి, ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
