-నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
-29న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరించిన నామినేషన్లపై నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 23న అప్పీళ్లను పరిష్కరిస్తారు.
నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు
నవంబర్ 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.
నవంబర్ 30వ తేదీన అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించి, అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
రెండో దశలో విశాఖపట్నం జిల్లాకు మినహాయింపు
రెండో దశ ఎన్నికల షెడ్యూల్లో విశాఖపట్నం జిల్లాకు ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మూడో దశలో విశాఖపట్నం జిల్లాలోని నాలుగు మండలాలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
