-ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి ద్వారం
-డి దేవానంద్ రెడ్డి, కార్యదర్శి కస్తూరిబా బాలికల స్కూల్స్ ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని విజయవాడలోని టాగోర్ స్మారక గ్రంథాలయంలో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలతో ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ పుస్తక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా పాఠశాలల కార్యదర్శి దేవానంద రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక టెక్నాలజీ, పురాణాలు, ఇతిహాసాలు, జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, బాలల పుస్తకాలు, కళలు, సాహిత్యం, ఆరోగ్యం, విజ్ఞాన శాస్త్రం తదితర విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కాంపిటేటివ్ పుస్తకాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా పుస్తకాలు, ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. అన్ని వయసుల పాఠకులకు, ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తకాల ద్వారా నూతన విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించడం ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా దేవానంద రెడ్డి పుస్తక ప్రదర్శనను సందర్శించి, వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. ఇన్ని విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ, విద్యార్థులు, యువత, పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
