రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిది ఏకపక్ష విజయమే: దేవినేని ఉమా

-టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం.. సీట్ల సర్దుబాటుపై దేవినేని, గోరంట్ల కీలక చర్చలు

రాజమండ్రి,  నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26న జరగనున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కలిసి కూటమి పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్న స్థానాలపై సమీక్ష నిర్వహించి, ప్రతి డివిజన్‌లోనూ కూటమి బలాబలాలు, గెలుపు అవకాశాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. సమావేశం అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో రాజమండ్రి కార్పొరేషన్‌లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు.

కూటమి పార్టీల మధ్య ఎలాంటి సమన్వయ లోపాలకు తావులేకుండా, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని పటిష్టంగా నిర్వహించాలని, కూటమి ఐక్యతే మన బలం.. సమిష్టి కృషే మన విజయానికి పునాది అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలియజేశారు.

రాజమండ్రి నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించుకునే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రణాళిక, సమన్వయంతో కూడిన సమగ్ర కార్యాచరణతో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఏకపక్షం చేయాలని నాయకులు సంకల్పించారు.