విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లను FACES చెక్లిస్ట్ ప్రకారం విస్తృతంగా తనిఖీ చేసి పబ్లిక్ టాయిలెట్ల వినియోగం మరియు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు .
నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశాల మేరకు, ముఖ్య వైద్యాధికారి డా. నిర్మల గ్లోరియా సూచనలతో సహాయ వైద్యాధికారులు డా. పి. అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో శానిటరీ సూపర్వైజర్లు ఎస్.వి.ఎస్. శ్రీధర్, సలీం, సోమరాజు పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టాయిలెట్ల నిర్వహణలో భాగంగా FACES (Functional, Accessible, Clean, Eco-friendly, Safe) ప్రమాణాల ప్రకారం సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. టాయిలెట్లలో నీటి సరఫరా, వెంటిలేషన్, సబ్బుతో కూడిన వాష్బేసిన్లు, తలుపులకు గడియలు, మహిళలు, పురుషులకు ప్రత్యేక సదుపాయాలు, దివ్యాంగులకు అందుబాటులో ఉండే సౌకర్యాలు, సూచిక బోర్డులు, పరిశుభ్రత, డస్ట్బిన్ల ఏర్పాటు, వ్యర్థాల నిర్వహణ, శానిటరీ ప్యాడ్ల పారవేత సౌకర్యాలు, తగిన లైటింగ్, కేర్టేకర్ల విధులు తదితర అంశాలను పరిశీలించారు. అలాగే ప్రజల అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు ఉన్న వ్యవస్థను కూడా తనిఖీ చేశారు.
తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్ది, టాయిలెట్లను నిరంతరం పరిశుభ్రంగా, వినియోగానికి అనువుగా, సురక్షితంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నగర ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రజలు కూడా టాయిలెట్లను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ పరిశుభ్రతను పాటించాలని, నగరాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.
