-సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు అవసరం
-మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనదే
-ఆరోగ్యశ్రీ ద్వారా సీజనల్ వ్యాధులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వం మనదే
-ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి
-బూస్టర్ డోస్ ను వేగవంతం చేయాలి
-ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు ఎంతో మేలు
-కోవిడ్ విషయంలో అప్రమత్తత అవసరం
-ప్రాణ నష్టం జరిగితే చర్యలు తప్పవు
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-సీజనల్ వ్యాధులు, కోవిడ్, బూస్టర్ డోస్, ఫ్యామిలీ డాక్టర్, మంకీ ఫాక్స్ తదితర అంశాలపై మంత్రి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, కోవిడ్, బూస్టర్ డోస్, ఫ్యామిలీ డాక్టర్, మంకీ ఫాక్స్ తదితర అంశాలపై సోమవారం పూర్తిస్థాయి సమీక్ష సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కుటుంబ సంక్షేమం కమిషనర్ శ్రీ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ రాఘవేంద్రరావు, ఆయా విభాగాల ముఖ్య అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్ ఎస్‌లు, సూపరింటెండెంట్‌లు తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కారణంగా ఏ ఒక్కరూ రాష్ట్రంలో మరణించడానికి వీల్లేదని చెప్పారు. సీజనల్ వ్యాధుల వల్ల మరణాలు ఎక్కడైనా నమోదవుతుంటే… అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ఎవరూ నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పారు.
ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు, మెరుగైన వైద్యం
సీజనల్ వ్యాధుల ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని మంత్రి విడదల రజిని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అప్రమత్తతతో ఉండాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఫాగింగ్, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, దోమతెరల పంపిణీ లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా డెంగీ, మలేరియా లాంటి వ్యాధులను గుర్తిస్తే.. ఆ ప్రాంతంలో వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. మందులు, టెస్టు కిట్లు, రక్తపు నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏ ఒక్కటి కూడా లేదూ… అనే మాటే రాకూడదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి
కోవిడ్ విషయంలో వైద్య బృందం అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఒకవేళ కోవిడ్ ఉధృతి పెరిగినా ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేసేలా యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తంగా ఉంచాలన్నారు. బూస్టర్ డోసు పంపిణీ ని వేగవంతం చేయాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయాలని తెలిపారు. ఫ్యామిటీ డాక్టర్ విధానాన్ని ఆగస్టు 15 వ తేదీ నుంచి అమలు చేయబోతున్నామని వివరించారు. దీనిపై వైద్య సిబ్బంది మొత్తానికి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారని, వారిలో ఒకరు పూర్తిగా 104 వాహనం ద్వారా ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని, ఆ పరిధిలోని ప్రతి రోగి హెల్త్ రికార్డు ఫ్యామిటీ డాక్టర్ వద్ద ఉండేలా సరికొత్త పద్ధతిని అమలు చేయబోతున్నామని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీల స్థాయిలో ఫ్యామిటీ డాక్టర్ విధానం అమలు కానుందని, దీనివల్ల ప్రజల ఆరోగ్య స్థితిని గణనీయంగా పెంచే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వం ఎంతో ఉదారంగా పనిచేస్తోందని, పేదలు ఎవరూ రోగాల విషయంలో ఆందోళన చెందకుండా ఉండేలా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు. వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తే.. ప్రజలకు ఎంతో మేలు చేసే వీలు చేకూరుతుందన్నారు.