ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ శుక్రవారం సాయంత్రం సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం కమిషనర్ కె. రామచంద్ర మోహన్ దంపతులు సాయంత్రం వేళ అత్యంత వైభవంగా జరిగిన పంచహారతుల సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేదోక్తంగా ఆశీర్వచనం చేయగా, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ శ్రీ అమ్మవారి శేషవస్త్రం,ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేసారు.
