విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని 84వ డివిజన్లో కోటి ఒత్తుల దీపోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం భక్తిపారవశ్యంతో నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో దీపారాధనకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, దీపాలను వెలిగించడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, శాంతి, సౌభాగ్యాల పట్ల ఆకాంక్ష పెంపొందుతుందని పేర్కొన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ విలువలను భావితరాలకు అందించడంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భక్తులంతా ఐకమత్యంతో నిర్వహించే సామూహిక దీపారాధనలు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా పరమేశ్వరుని కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు.
కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కోటి ఒత్తుల దీపోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. దీపాల వెలుగులతో పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కోటి ఒత్తుల దీపోత్సవం పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
