నూతన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజాప్రతినిధులుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాసేవలో ముందుండాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నూతన కార్పొరేటర్లకు సూచించారు.
బుధవారం బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రతి కార్పొరేటర్ తమ తమ డివిజన్లలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు అవకాశం కల్పించాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రజాసేవలో జవాబుదారీతనం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజలు కల్పించిన అవకాశాన్ని బాధ్యతగా భావించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవే ప్రధాన లక్ష్యాలుగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని నూతన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
