హోటళ్లపై ముమ్మర తనిఖీలు

-పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హోటళ్లకి నోటీసులు జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశాల మేరకు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై ప్రజారోగ్య విభాగం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుణదల, వన్ టౌన్ ప్రాంతాల్లో గల పలు హోటళ్లలలో అధికారులు తనిఖీ చేశారు.

తనిఖీల్లో భాగంగా వన్ టౌన్ లో గల స్టార్ హోటల్, ఊర్మిళ నగర్ ఆసిఫ్ చికెన్ సెంటర్, గుణదల లో గల సుభాని హోటల్ తదితర హోటళ్లను పరిశీలించగా, గోడలు మరియు ఇతర ప్రదేశాల్లో బూజు ఏర్పడటం, అపరిశుభ్రమైన వాతావరణం నెలకొని ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా నాణ్యమైన తాగునీటిని వినియోగించకపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ మరియు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు.

పరిశుభ్రత నిబంధనలు పాటించని హోటల్ యాజమాన్యాలపై అధికారులు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో లోపాలు గుర్తించిన హోటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న హోటల్ యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దుకొని, పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా లోపాలను సరిచేయని హోటల్ యాజమాన్యాలపై చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించేలా హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నగరపాలక సంస్థ అధికారులు సూచించారు.

ఈ తనిఖీలలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరీ సూపర్‌వైజర్లు డి. సోమరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు యోగేంద్ర, జానకి రామ్, రామకృష్ణ, ప్రశాంతి కుమారి, రాంబాబు, గోపయ్య, గుర్రం నరసింహారావు ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.