పట్టణ పారిశుధ్య అభివృద్ధికి ఫెడరల్ బ్యాంక్ సీఎస్ఆర్ సహకారం

-ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీలకు చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఫెడరల్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీలకు రెండు టాటా ఏస్ చెత్త సేకరణ వాహనాలను అందించింది. ఒక్కో వాహనం విలువ రూ.13.57 లక్షలు కాగా, మొత్తం రూ.27.14 లక్షల వ్యయంతో ఈ సహకారం అందించింది.
మంగళవారం అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ భవనంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. తడి, పొడి చెత్త సేకరణ, రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.
చిన్న పట్టణ స్థానిక సంస్థలకు ఫెడరల్ బ్యాంక్ అందించిన సీఎస్ఆర్ సహకారాన్ని ఆయన అభినందించారు. పారిశుధ్య మౌలిక సదుపాయాల బలోపేతం ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముమ్మిడివరం నగర పంచాయతీలో రోజుకు సుమారు 10 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ప్రస్తుతం 6 టన్నులు సేకరిస్తున్నారు. మడకశిరలో రోజుకు 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఇంటింటి సేకరణ ద్వారా 6.5 టన్నులు సేకరిస్తున్నారు. కొత్త వాహనాలతో చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్, ఎస్‌ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, ఫెడరల్ బ్యాంక్ సౌత్ హెడ్ కల్పన పి., ప్రభుత్వ, సంస్థాగత వ్యాపార విభాగం ఏపీ, తెలంగాణ హెడ్ గిరిధరన్ ఎస్. తదితర అధికారులు పాల్గొన్నారు.