-సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
-ఉద్యానరంగంలో పెట్టుబడులకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్
-వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, ఎల్ నినో విపత్తుల వంటి ప్రకృతి వైపరీత్యాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో పంట నష్టాన్ని నివారించేలా సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు, స్పష్టమైన ఫలితాలు, అధిక లాభాలు కనిపించాలని స్పష్టం చేశారు.
ఉద్యాన పంటల్లో కొత్త రకాలకు ప్రాధాన్యం
హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సహకారంతో సుమారు రూ.40 వేల కోట్ల నిధులను సమీకరించాలని, మిగిలిన రూ.60 వేల కోట్లను వివిధ పెట్టుబడుల ద్వారా సమకూర్చుకుని కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రారంభించాలని, ప్రతినెలా పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ప్రకృతి వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యాన పంటల్లో కొత్త రకాలను పరిచయం చేస్తూ ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఉద్యానవన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘హార్టికల్చర్ సమ్మిట్’ను నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, పంటల ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుతో కరువు పరిస్థితులను అధిగమించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉద్యానవన సాగులో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని అధికారులు వివరించారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆధునిక పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు కొత్త రకాల పంటలను రైతులకు పరిచయం చేయాలని, భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రైతులతో పాటు కౌలు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాలని సూచించారు.
తుఫాన్లను తట్టుకునేలా పంటల సాగు క్యాలెండర్
తుఫాన్ల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైతే పంటల సాగు క్యాలెండర్‌ను ముందుకు జరపాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సాగును ముందుగానే ప్రారంభించి తుఫాన్ల ప్రభావం పంటలపై పడకుండా చూడాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంటలకు ఇటీవల సంభవించిన తుఫాన్లతో పెద్దగా నష్టం వాటిల్లలేదని, దీనిపై వరి రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందే సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత, పంటల సాగు కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 2027-28 నాటికి 26.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని తెలిపారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉటంకిస్తూ మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని తెలిపారు. అలాగే, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం సూచించారు. జలధార-2 పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే జలధార-3 కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం ఎంత నమోదవుతోంది, భూగర్భ జలాల లభ్యత ఎంత ఉందనే అంశాలపై కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండాలని, వర్షపు నీటి వినియోగం, భూగర్భ జలాల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
రైతుల కోసం అన్ని సేవలూ ఒకే యాప్‌లోకి
వ్యవసాయం, ఆక్వా, హార్టికల్చర్ రంగాలకు సంబంధించిన సేవలన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు అవసరమైన సమాచారం, సాగు సూచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఒకే వేదిక ద్వారా అందుబాటులోకి తేవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి ఏడాది పొడవునా రాష్ట్రంలో పచ్చదనం ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అగ్రివాచ్పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి, దాని సమర్థ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి పశుసంపదను పెంచాలని, వీబీ-జీ రామ్-జీ పథకాన్ని పశుసంపద అభివృద్ధికి ఏ మేరకు వినియోగించుకోవచ్చో అధ్యయనం చేయాలన్నారు.
12.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం
ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్‌నినో కరువు పరిస్థితులు, అర్నబ్, మురసు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా 26 జిల్లాల్లో మొత్తం 12.64 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. ఇందులో 9.67 లక్షల హెక్టార్లలో ఎల్‌నినో కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. అర్నబ్ తుఫాను కారణంగా 13 జిల్లాల్లో 3.82 లక్షల మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతినగా, మురసు తుఫాను ప్రభావంతో 9 జిల్లాల్లో 52,402 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలతో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు మొత్తం రూ.2,743 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 11.55 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పంటల బీమా పరిధిలో ఉందని అధికారులు తెలిపారు. నష్టపోయిన పంటలకు రూ.1,732 కోట్ల బీమా క్లెయిమ్‌లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బీమా కింద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం కూడా అందే అంశంపై సమగ్ర అవగాహన కల్పించాలని తెలిపారు. డిజి రైతు బజార్ ప్రారంభించాక ఇప్పటికి లక్షకు పైగా ఆర్డర్లకు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే మొబైల్ రైతు బజార్లు వచ్చే ఫిబ్రవరి కల్లా మరో 40 పెంచనున్నట్టు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
