ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రతినిధులు

-జనవరి 1న పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
-బుక్ ఫెస్టివల్ నిర్వహణకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కేటాయించాలని వినతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సచివాలయంలో మంగళవారం కలిశారు. 2027 జనవరి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న 37వ పుస్తక మహోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. గత 36 ఏళ్లుగా విజయవాడలో పుస్తక మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు, సాహిత్య సమావేశాలు, పుస్తక ప్రియుల పాదయాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోన్నట్లు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు ఈ పుస్తక మహోత్సవాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో పీడబ్ల్యూడీ మైదానంలో పుస్తక మహోత్సవాలను నిర్వహించామని, అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించామని తెలిపారు. గత రెండు పుస్తక మహోత్సవాలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన నేపథ్యంలో ఈసారీ అదే వేదికను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. పుస్తక మహోత్సవ ఏర్పాట్లతో సహా ఇతర అవసరాల నిమిత్తం డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు స్టేడియంను కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ప్రజల్లో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించేందుకు విజయవాడలో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నట్లు సీఎంకు వివరించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పుస్తక మహోత్సవ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ జి.లక్ష్మీ, సెక్రటరీ కె. లక్ష్మయ్య, ప్రింటర్స్ – పబ్లిషర్స్ అసోసియేషన్ సెక్రటరీ కాట్రగడ్డ మోహన్ ఉన్నారు.