మీ బాధ్యతల నిర్వహణ పట్ల సంతృప్తికరంగా ఉన్నారా?

-నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి
-బోధనాసుపత్రుల పనితీరు మరింత మెరుగుపడాల్సిందే
-ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ హితవు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ బోధనాసుపత్రుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. వీటికి నేతృత్వం వహించే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు నాయకత్వ లక్షణాలను మరింత పెంచుకోవాలని హితవు పలికారు. ప్రత్యక్షంగా బోధనాసుపత్రుల పనితీరును పర్యవేక్షించే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు విధుల నిర్వహణ తీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్బోధించారు. ఉన్నత వైద్య సేవలను అందించడంలో కీలకంగా వ్యవహరించే బోధనాసుపత్రుల పనితీరుపై ప్రజల సంతృప్త స్థాయి మిగిలిన ఆసుపత్రుల కంటే తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలవారీగా బోధనాసుపత్రుల పనితీరుపై సమీక్ష

విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో జిల్లాలవారీగా బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో వాటి పనితీరుపై వర్క్‌షాప్ జరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి హాజరైన కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా నియమితులైనవారిలో ఎంతమంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారో స్వీయ సమీక్ష చేసుకోవాలని తెలిపారు.

ఎందుకు వైద్య సేవలు తగ్గుతున్నాయి

ప్రైవేటు ఆసుపత్రుల కంటే బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు తగ్గుతున్నాయని, కానీ నియామకాలు, నిర్వహణ వ్యయం బాగా పెరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లో పారిశుధ్య పరిస్థితులకు తగినట్లు మార్కులు వేయడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమరుపాటు తగదని ఆయన తెలిపారు.

రోగుల అవసరాలు, ప‌రిష్కారాల‌పై చొరవ చూపాలి

రోగుల వైద్య సేవలు, అవసరాలు, సౌకర్యాల కల్పన, రద్దీ నియంత్రణ వంటి విషయాల్లో సూపరింటెండెంట్లు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయన్నారు. పరిమితుల మధ్య తగిన నిర్ణయాలు చొరవతో తీసుకునే సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు రోగులకు మేలు చేకూరుస్తాయన్నారు. విధులకు హాజరైన వైద్యులు పూర్తిస్థాయిలో ఆసుపత్రుల్లో ఉంటున్నారా లేదా అన్నది కూడా పరిశీలిస్తామని తెలిపారు. వైద్యుల హాజరు కచ్చితంగా ఉంటే సదరు ఆసుపత్రుల పనితీరు మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజల సంతృప్తి స్థాయి పెరగాల్సిందే

వైద్య సేవల పట్ల ప్రభుత్వం సేకరించే ప్రజల సంతృప్త స్థాయి తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లకు డీఎంఈ తరచూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని, ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లలో ఇప్పటికైనా మార్పు రావాలని పేర్కొన్నారు. ప్రజల సంతృప్త స్థాయి తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి, మంత్రి రానున్న రోజుల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో సమీక్షించే అవకాశాలు కూడా లేకపోలేదని వెల్లడించారు. డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో మంగళ, బుధవారాల్లో అన్ని బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, డీఎంఈ అదనపు సంచాలకులు డాక్టర్ రాధికారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.