Breaking News

ఏసుక్రీస్తు బోధనలు నేటికీ ప్రపంచానికి ఎంతో అవసరం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడే అదే నిజమైన క్రిస్మస్ అవుతుందని, ఏసుక్రీస్తు బోధనలు నేటికీ ప్రపంచానికి ఎంతో అవసరమని, విశ్వవ్యాప్తంగా జరిగే అతి పెద్ద పండుగ క్రిస్ట్మస్ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహించిన క్రిస్టమస్ హై – టీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత బైబిల్ లోని పవిత్ర వచనాలను పాస్టర్ వాల్టర్స్, థామస్ అబ్రహం రెవరెండ్ సుకుమార్ లు చదివి వినిపించారు. క్రిస్మస్ ఆరాధన గీతాలను గిటారిస్ట్ సాల్మన్ రాజు, కీబోర్డు ప్లేయర్ తెన్నెల సామ్యూల్, రితం ప్యాడ్స్ నిరీక్షణల వాయిద్య సహకారంతో ఎల్ ఈ ఎఫ్ చర్చ్,నోబుల్ ప్యారిష్ యువతీ యువకులు ఎంతో శ్రావ్యంగా అలపించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ క్రిస్మస్ సందేశాన్ని వివరిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుందన్నారు. యేసు ప్రభువు జననం ఈ సర్వ సృష్టికి ఒక ఆశాకిరణమని కొనియాడారు. ఆ యేసయ్య దీవెనలు మీ అందరి ప్రార్థనలు కారణంగానే ప్రజలకు మేలు చేయాలనే దైవ గుణాలున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అందుకే ఆయనలో ఏసుక్రీస్తులోని శాంతి సహనం క్షమాగుణం పేదల పట్ల కనికరం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయన్నారు. పవిత్ర బైబిల్ లోని దేవుని వచనాలను తుచ తప్పకుండా ఆచరిస్తున్న ముఖ్యమంత్రికి దేవుని దీవెనలు మెండుగా ఉన్నాయన్నారు.
తాను చిన్నప్పుడు సండే స్కూల్ కి వెళ్లేవాడిని, తన భార్య క్రైస్తవ విశ్వాసి అని ఆమె ప్రార్థనలు కారణంగా తాను ఈ స్థితికి చేరుకున్నట్లు పలువురి హర్షద్వానాల మధ్య మంత్రి జోగి రమేష్ సాక్ష్యం చెప్పారు. ఇంటి నుంచి వెలుపలకు వచ్చేటప్పుడు తనని కనీసం రెండు నిమిషాలైనా ప్రార్థన చేసుకోని అప్పుడు వెళ్ళమని ఆమె కోరుతుందని మంత్రి చెప్పారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బైబిల్ ను క్షుణంగా చదివారని, క్రీస్తులోని కనికర సంపన్నత్వం ఆయనను కదిలించిందని, కనుకనే నిరుపేదల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ వివరించారు.
అనంతరం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, తాను యువకుడిగా ఉన్నప్పుడు మచిలీపట్నం ముస్తాఖాన్ పేటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే వాడినని గుర్తు చేసుకున్నారు. క్రీస్తులోని దయాగుణం, పేదల పట్ల కనికరం, త్యాగ లక్షణాలు ఎవరినైనా ఆకర్షిస్తాయన్నారు.
మన దేశం లౌకికవాద లక్షణాలు కలిగిందని, అన్ని మతాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నాయన్నారు. మతమౌడ్యం తలకెక్కిన ఏ లూసిఫర్ అయినా క్రైస్తవులను ఇబ్బంది కలిగిస్తే వారు తనను నేరుగా సంప్రదించాలన్నారు. వారికి తన మద్దతు ఉంటుందన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే క్రిస్మస్ పండగన్నారు. జిల్లాలోని క్రైస్తవ సోదరీ సోదరలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
స్థానిక మల్కాపట్నానికి చెందిన లెమన్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ సంఘ కాపరి డాక్టర్ తంటేపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, అందరూ కోరుకొనేది శాంతి అని, శాంతి కోపాన్ని, ద్వేషాన్ని తగ్గిస్తుందన్నారు. యేసు మార్గంలో నడవడం గొప్ప విధానమన్నారు. మతాల పేరుతో కొట్టుకోవడం మూర్ఖత్వమన్నారు. ఎదుటి వారికి సహాయం చేయడమే అసలైన క్రిస్టియన్ తత్వం అని చెప్పారు. కస్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఒక గొప్ప విషయమన్నారు. ఏసుక్రీస్తు పుట్టుక ఒక గొప్ప చరిత్రని, క్రీస్తు పూర్వం క్రీస్తుశకం ఆయన జన్మ ద్వారానే ఏర్పడ్డాయిన్నారు. సర్వ మానవాళి అందరూ సత్ప్రవర్తనతో సోదర భావంతో శాంతి సౌబ్రాతృత్వంతో మెలగాలన్నారు.
అనంతరం కేండిల్స్ వెలిగించి క్రిస్మస్ కేక్ ను మంత్రి జోగి రమేష్ కట్ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, ఏఎస్పి రామాంజనేయులు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్, వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా, క్రిస్టియన్ మైనార్టీ బోర్డు సభ్యులు జక్కుల ఆనందబాబు, మచిలీపట్నం 12వ డివిజన్ ఇంచార్జ్ బందెల థామస్ నోబుల్, కో ఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు పరిశుద్ధ రాజు జిల్లాలో పలు ప్రాంతాల నుండి క్రైస్తవ మత పెద్దలు పాస్టర్లు తదితర పాస్టర్లు, జిల్లాకి చెందిన పలు శాఖల అధికారులు,క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *