శ్రీశ్రీశ్రీ విజయ కనక దుర్గాంబా దేవి భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా ప్రభ ఊరేగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీశ్రీశ్రీ విజయ కనక దుర్గాంబా దేవి భక్త సమాజం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని సూర్యనారాయణ వీధిలో నిర్వహించిన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 18న భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 25వ తేదీ ఆదివారం నిర్వహించిన అమ్మవారి ప్రభ మంగళ వాయిద్యాలతో కనులు మిరుమిట్లు గొలిపే కలర్ ఫోకసింగ్ లైట్లుతో, బేతాళ సెట్లు, కాళ్ల గజ్జల డప్పుల డాన్స్ తో అత్యంత వైభవంగా జరిగిన ఊరేగింపునకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తజనుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ప్రభ ఊరేగింపు కొనసాగింది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సుమారు 45 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ విజయ కనక దుర్గాంబా దేవి భక్త సమాజం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కమిటీ సభ్యులకు, తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.