-రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఫొటో ఓటర్ స్లిప్పు కలిగి ఉండటం ఓటు వేయడానికి తప్పనిసరి కాదని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నెం. 173/SEC-F1/2026 ప్రకారం, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్పుల ముద్రణ, పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కమిషనర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఓటర్లకు సంబంధిత పోలింగ్ కేంద్రం నంబరు, ఓటరు జాబితాలోని క్రమ సంఖ్య తెలుసుకునేందుకు ఫొటో ఓటర్ స్లిప్పులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ స్లిప్పులను ఎన్నికల సిబ్బంది ద్వారా నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని, పంపిణీలో పారదర్శకతతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఫొటో ఓటర్ స్లిప్పు కలిగి ఉండటం ఓటు వేయడానికి తప్పనిసరి కాదని, స్లిప్పు లేని కారణంగా ఏ ఓటరినీ ఓటు హక్కుకు అనర్హుడిగా పరిగణించరాదని స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని వివరించారు. ఫొటో ఓటర్ స్లిప్పును గుర్తింపు పత్రంగా పరిగణించరాదని తెలిపారు.
ఈ సమావేశంలో మేయర్, ఆర్వో, పీడీ హౌసింగ్ రజినీ కుమారి, అదనపు కమిషనర్లు కే. శకుంతల, జి. సృజన, అసిస్టెంట్ కమిషనర్ డి.ఎస్.ఎస్. శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు యారాం మనోహర్ రాజా (భారత జాతీయ కాంగ్రెస్), ఈ.వి. నారాయణ (సీపీఐ), పి. ముషరఫ్ రావు (సీపీఎం), ఎం. నవీన్ కుమార్ (బీజేపీ), ఎం. వినోద్ కుమార్ (బీఎస్పీ), నవనీతం సాయిబాబా (తెలుగుదేశం పార్టీ), గుండె సందీప్ పాల్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), పి. పరమేశ్వరరావు (ఆమ్ ఆద్మీ పార్టీ), జి. జగన్నాథం శ్రీనివాస్ (జనసేన పార్టీ) తదితరులు పాల్గొన్నారు.
