విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ–కొచ్చి మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఇండిగో, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలకు ప్రతిపాదనలు సమర్పించింది.
నవంబర్ నుంచి జనవరి వరకు జరిగే శబరిమలై అయ్యప్ప స్వామి యాత్రా సీజన్లో ఈ మార్గంలో విమాన ప్రయాణాలకు గణనీయమైన డిమాండ్ ఉంటుందని ఏపీ ఛాంబర్స్ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. విజయవాడ విమానాశ్రయం సేవలందించే పరిసర ప్రాంతాల నుంచి ఏటా సుమారు 3 లక్షల మంది భక్తులు శబరిమలై యాత్రకు వెళ్తున్నారని అంచనా వేసింది. విజయవాడ నుంచి కొచ్చికి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపింది.
రాబోయే యాత్రా సీజన్లోనే ఈ సర్వీసులను ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమానాల రాకపోకల సంఖ్య, సమయాలను నిర్ణయించాలని ఏపీ ఛాంబర్స్ రెండు విమానయాన సంస్థలను కోరింది. యాత్రా సీజన్‌తో పాటు పర్యాటకం, వైద్య సేవలు, వ్యాపార ప్రయాణాలు తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఈ సర్వీసులను నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను కూడా ఏపీ ఛాంబర్స్ ప్రస్తావించింది. విజయవాడ–కొచ్చి మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ ఏర్పడటం ద్వారా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ప్రతిపాదనలపై త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి, అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఏపీ ఛాంబర్స్ రెండు విమానయాన సంస్థలకు విజ్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే శబరిమలై యాత్రా సీజన్ నాటికే ఈ సర్వీసులను ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరింది.
విజయవాడ–కొచ్చి మధ్య ఈ కీలకమైన విమాన మార్గం అందుబాటులోకి రావడానికి ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు సానుకూలంగా స్పందిస్తాయని ఏపీ ఛాంబర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.
