-పిటిడి ఉద్యోగులారా.. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధం కండి..!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1450 విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నిర్వహించేందుకు జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని ఏపీ పీటీడీ(ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.
యాజమాన్యం స్పందించి టెండర్లను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సోమవారం నిర్వహించిన జేఏసీ రాష్ట్రస్థాయి నాయకుల గూగుల్ మీట్లో ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగ భద్రత, యాజమాన్యం ఇచ్చిన హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 13న జారీ చేసిన 1450 విద్యుత్ బస్సుల టెండర్ల ద్వారా 29 డిపోలలో ప్రైవేటు ఆపరేటర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్న యాజమాన్య నిర్ణయం ఆర్టీసీ భవిష్యత్తుకు, ఉద్యోగుల ఉపాధి భద్రతకు విఘాతం కలిగించే ప్రమాదముందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదు.. ప్రైవేటు నిర్వహణకే వ్యతిరేకం
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఆర్టీసీయే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, సొంత ఉద్యోగులతో నిర్వహించాలని జేఏసీ స్పష్టం చేసింది. సంస్థకు సొంత డిపోలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది, సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రైవేటు ఆపరేటర్లపై ఆధారపడాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది.
ఆగస్టు 12న యాజమాన్యం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4,000 కొత్త బస్సులు సమకూర్చాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తాం.!
యాజమాన్యం ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి ప్రైవేటు టెండర్లను రద్దు చేసి జేఏసీతో చర్చలు జరపాలని నాయకులు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ముందుగా ఉద్యోగులను చైతన్యపరిచి ఉద్యమానికి సన్నద్దము చేసి దశలవారీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, సి.హెచ్. సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్.వి. శేషగిరిరావు, వై.ఎస్. రావు, కె. సూర్యప్రకాశరావు, డి. మాలాద్రి వీరితో పాటు జెఎసి రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
