మహర్షి వాల్మీకి ఆదర్శాలు, రామాయణ సందేశం సమాజానికి నిత్యనూతనం

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మహాకావ్యం రామాయణాన్ని లోకానికి అందించిన ఆది కవి మహర్షి వాల్మీకి బోధనలు, జీవిత ఆదర్శాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్‌ చంద్ర, తదితరులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ దృఢ సంకల్పం, పరివర్తనతో సామాన్య వ్యక్తి కూడా మహర్షిగా మారవచ్చని వాల్మీకి తన జీవితం ద్వారా నిరూపించారని తెలిపారు. రామాయణం కేవలం ఒక పురాణ గ్రంథం మాత్రమే కాదని, మానవ విలువలు, కుటుంబ బాంధవ్యాలు, సమాజ హితాన్ని చాటిచెప్పే దివ్య ప్రబంధమని కొనియాడారు. రాముడి ద్వారా ఆదర్శ పాలన, ధర్మం, న్యాయం ఎలా ఉండాలో లోకానికి చూపిన మహోన్నత వ్యక్తి వాల్మీకి అని, ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. నేటి యువత రామాయణంలోని సద్గుణాలను అలవర్చుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలు, న్యాయం వెల్లివిరియడానికి మహర్షి వాల్మీకి సూచించిన నైతిక విలువలు ఎంతో దోహదపడతాయని అన్నారు. తప్పులను సరిదిద్దుకుని సన్మార్గంలో పయనించవచ్చనే గొప్ప సందేశం వాల్మీకి జీవితంలో కనిపిస్తుందని చెప్పారు.

నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్‌చంద్ర మాట్లాడుతూ, వాల్మీకి సాహిత్యం సాంస్కృతిక వారసత్వానికి మూలస్తంభమని, రామాయణం ద్వారా అందించిన నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.నరసింహo, ఆర్డీవో వెన్నెల శ్రీను, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.