-నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు–2026లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ ఎన్నికల వ్యయ ఖాతాలను పక్కాగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల నమోదు, ఖాతాల పరిశీలనపై రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిర్దేశిత మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం–1955, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ల (మేయర్ మరియు సభ్యుల ఎన్నికల నిర్వహణ) నియమావళి–2026 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ప్రతిరోజూ నిర్వహించే ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల వ్యయ వివరాలను సంబంధిత బిల్లులు, వోచర్లు, రసీదులతో సహా ప్రొఫార్మా-II, ప్రొఫార్మా-III నమూనాల్లో నమోదు చేసి, ప్రతి మూడు రోజులకు ఒకసారి పరిశీలన కోసం సమర్పించాలని సూచించారు.
ఎన్నికల వ్యయ ఖాతాల పరిశీలనలో భాగంగా మొదటి విడత పరిశీలన ఈ నెల 27వ తేదీన, రెండో విడత పరిశీలన ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలను సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి అప్పటివరకు చేసిన ప్రచార ఖర్చుల వివరాలను మొదటి పరిశీలన సమయంలో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అభ్యర్థులు లేదా వారి అధీకృత ఎన్నికల ఏజెంట్లు నిర్ణీత తేదీల్లో సమయానికి హాజరై, ఎన్నికల వ్యయ వివరాల సారాంశాలతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించి తప్పనిసరిగా రసీదు పొందాలని స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యయ ఖాతాలు పూర్తిస్థాయిలో, ఖచ్చితంగా, వాస్తవ ఖర్చులకు అనుగుణంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నిర్దేశిత నమూనాలో ఖాతాలను నిర్వహించకపోయినా, నిర్ణీత గడువులోగా వాటిని పరిశీలనకు సమర్పించకపోయినా ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం–1955లోని సెక్షన్ 20B ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాబట్టి గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎన్నికల వ్యయ ఖాతాలను క్రమబద్ధంగా నిర్వహించి నిర్ణీత సమయానికి పరిశీలనకు సమర్పించాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ సూచించారు.
