Breaking News

కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు

-చేపల వేట, పెంపకంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం పీఎంఎంఎస్‌వై లక్ష్యం – పర్షోత్తం రూపాలా

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త :

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా, సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్‌ ఆధ్వర్యంలో సాగాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదార్లతో రూపాలా సంభాషించారు. చేపల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్కెటింగ్, ఎగుమతులు వంటి సంస్థాగత ఏర్పాట్ల గురించి చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎంఎంఎస్‌వై పథకం కింద నాలుగు చక్రాల వాహనాలను లబ్ధిదార్లకు అందించారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న లబ్ధిదార్లు, తమ క్షేత్ర స్థాయి అనుభవాలు, విజయగాథలను పంచుకున్నారు. కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి ఎస్‌ అప్పల రాజు, గ్రామ సర్పంచ్, పలువురు ప్రముఖులు మత్స్యకార్లు, మత్స్య ఆధారిత వర్గాల సమస్యలను అర్థం చేసుకున్నారు.

అక్కడి నుంచి ముందుకు సాగిన  పర్షోత్తం రూపాలా, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. అక్కడ మత్స్యకార్లు, తీర ప్రాంత వర్గాలు, వాటాదార్లతో సంభాషించారు. పీఎంఎంఎస్‌వై, కేసీసీ వంటి మత్స్య రంగ సంబంధిత పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. ఐస్‌బాక్స్‌లతో కూడిన ద్విచక్ర వాహనాలు & నాలుగు చక్రాల వాహనాలు, బతికున్న చేపల రవాణా వాహనాలు, పీఎంఎంఎస్‌వై సంబంధిత ధృవపత్రాలు/ఇతర ప్రయోజనాలు, కిసాన్ క్రెడిట్ కార్డులను తీర ప్రాంత మత్స్యకార్లు, మత్స్య రైతులు, యువ మత్స్య పారిశ్రామికవేత్తలు, మహిళా చేపల పెంపకందార్లకు పంపిణీ చేశారు.

మత్స్యకార్ల సమస్యలు, అవకాశాలపై కేంద్ర మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. మత్స్యకార వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పీఎంఎంఎస్‌వై కార్యకలాపాలు మత్స్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల వేట, చేపల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం ఈ పథకం లక్ష్యం అని అన్నారు. మత్స్యకార్లు, రైతులు కేసీసీని సద్వినియోగం చేసుకుని, తమ జీవితాలను మెరుగుపరుచుకునేలా పథకాలపై అవగాహన కల్పించాలని వాలంటీర్లకు సూచించారు. మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల హక్కులకు సంబంధించిన సమస్యలను ఈ కార్యక్రమంలో లబ్ధిదార్లు ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అత్యధిక సాయం అందిందని  రూపాలా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సాగర్ పరిక్రమలో అన్ని మత్స్యకార ప్రాంతాలు, ప్రజలు ఉన్నారన్నారు. అన్నిచోట్లా మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. మత్స్య సంపద, ఆక్వాకల్చర్‌ సహా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి రిజర్వేషన్లు కల్పించినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

సాగర్‌ పరిక్రమ యాత్రలో భాగంగా, కేసీసీ క్యాంపులు ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక బృందం, ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాల్లో మౌలిక సదుపాయాల అధ్యయనానికి సాంకేతిక అధికారుల బృందం వంటి కీలక కార్యక్రమాలు చేపట్టామని సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి ఎస్ అప్పల రాజు, పార్లమెంట్ సభ్యురాలు వి గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సంయుక్త కార్యదర్శి  నీతు కుమారి ప్రసాద్, ఇతర ప్రభుత్వ అధికార్లు కూడా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నాలుగో రోజు కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి, దాదాపు 8,400 మంది పాల్గొన్నారు. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సాగర్ పరిక్రమ ఇంకా ముందుకు సాగుతుంది, మత్స్యకార్లు & సంబంధిత వాటాదార్ల జీవితం, జీవనోపాధిపై సానుకూల ప్రభావం చూపేలా విస్తృతమవుతుంది.

మత్స్య రంగం వర్ధమాన రంగంగా అభివృద్ధి చెందుతోంది. సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించి, తద్వారా సమానమైన & సమ్మిళిత వృద్ధిని తీసుకురాగల సామర్థ్యం ఈ రంగానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య రంగ సంబంధిత పథకాలు/కార్యక్రమాల గురించి వివరించడం, ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయడం, బాధ్యతాయుతమైన మత్స్య సంపదను ప్రోత్సహించడం, మత్స్యకార్లు & సంబంధిత వాటాదార్లలో సంఘీభావాన్ని తీసుకురావడం సాగర్ పరిక్రమ ఉద్దేశాలు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *